ఏలూరు: ఏలూరు నగరంలో ప్రమాదకరరీతిలో వేలాడుతున్న కేబుల్ నెట్వర్క్, ఇంటర్నెట్ వైర్లను సంబంధిత సంస్థల వారు వెంటనే సరిచేయాలని ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఎస్. వెంకటకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు నగరంలో కొన్ని ప్రదేశాలలో కేబుల్ నెట్వర్క్, ఇంటర్నెట్ సేవలకు సంబంధించి కేబుల్ వైర్లు ప్రమాదకరరీతిలో వేలాడుతున్నాయని, వాటి కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యం మరియు ప్రమాదాలకు గురవుతున్నారని, వాటిని తొలగించాలని, వీటిలో చాలా వైర్లు వినియోగంలో లేనివిగా గుర్తించడం జరిగిందన్నారు. వీటిపై సంబంధిత సంస్థలను గతంలో హెచ్చరించడం జరిగిందన్నారు. అయినప్పటికీ కేబుల్స్ ని సరిచేయలేదన్నారు. ప్రజల ప్రాణాల భద్రత దృష్ట్యా వినియోగంలో లేనివి మరియు ప్రమాదకరరీతిలో వేలాడుతున్న వైర్లను సంబంధిత సంస్థల వారు రాబోయే మూడు రోజులలలోగా తొలగించాలని, లేనిచో నగరపాలక సంస్థ వారు వాటిని తొలగించి, అందుకు ఐన ఖర్చులను సంబంధిత సంస్థల వారికి పంపడం జరుగుతుందని, అంతేకాక సంబంధిత సంస్థలపై కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందని కమీషనర్ వెంకట కృష్ణ హెచ్చరించారు.