Ticker

6/recent/ticker-posts

కొడాలి నానికి షాకిచ్చిన చంద్రబాబు సర్కార్..


Andrapradesh: మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్. ఇప్పటి వరకు కొడాలి నాని నివాసం దగ్గర ఉన్న భద్రత సిబ్బందితో పాటు ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందిని తొలగించారు.. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ్టి వరకు కొడాలి నాని నివాసం దగ్గర.. ఆయనకు వ్యక్తిగత భద్రతగా ఉన్న సిబ్బంది వెనక్కు రానున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే సాధారణంగా ప్రభుత్వాలు మారిన సమయంలో మాజీ మంత్రులకు భద్రతను ఉపసంహరిస్తుంటారని చెబుతున్నారు.. అనుకున్నదే జరిగిందంటున్నారు. అయితే ఇటీవల కొడాలి నాని నివాసం దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు.. కోడిగుడ్లతో దాడి చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఇలాంటి సమయంలో భద్రతను ఉపసంహరించడంపై చర్చ జరుగుతోంది.


కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఉన్నారు.. 2004 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కొడాలి నాని తెలుగు దేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు.. 2004లో గుడివాడ నుంచి పోటీచేసి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2009 ఎన్నికల్లో మరోసారి టీడీపీ నుంచి గెలిచారు.. అయితే వైఎస్సార్‌సీపీ ఆవిర్భావంతో ఆయన ఆ పార్టీలోకి వెళ్లారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసి గుడివాడ నుంచి మూడోసారి విజయం సాధించారు.. అయితే పార్టీ అధికారంలోకి రాలేదు. కొడాలి నాని 2019 ఎన్నికల్లో మళ్లీ గుడివాడ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు.

వరుసగా నాలుగుసార్లు గెలవడంతో వైఎస్ జగన్ ఆయనకు మంత్రి పదవిని అప్పగించగా.. పౌరసరఫరాలశాఖ బాధత్యల్ని చూశారు.. అయితే రెండున్నరేళ్ల తర్వాత కొడాలి నాని మంత్రి పదవి నుంచి బయటకు వచ్చారు. 2024 ఎన్నికల్లో ఐదోసారి గుడివాడ నుంచి పోటీచేసిన కొడాలి నాని.. తెలుగు దేశం పార్టీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో 53వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం ఆయనకు ఉన్న భద్రతను ఉపసంహరించుకుంది.