ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ అన్నది ముగిసిపోయిన కథగానే చూడాలని అంటున్నారు. ఎందుకంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గత రెండు నెలలూ సామాజిక పెన్షన్లను సచివాలయం సిబ్బంది చేతనే ఇప్పించింది. అది కూడా ఒకటో తేదీన దాదాపుగా శత శాతం దగ్గరగానే పంపిణీ జరిగిపోయింది.
ఇటు పెన్షనర్లకు ఇబ్బంది లేదు, అటు ప్రభుత్వానికి కూడా ఏ సమస్యలూ రావడం లేదు. మరి ఈ మధ్యన ఎవరైనా వాలంటీర్లను గుర్తు తెచ్చుకుంటున్నారా అంటే లేనే లేదు అని చెప్పాలి. వాలంటీర్లకు చివరి సారిగా జూన్ లో గౌరవ వేతనంగా అయిదు వేలు పడిందని అంటున్నారు. జూలై, ఆగస్ట్ రెండు నెలలూ వారికి వేతనాలు పడలేదు.
దాంతో పాటు వారిని విధులలోకి పిలవడం లేదు. రెండున్నరల లక్షల మంది వాలంటీర్లు ఉంటే అందులో గత ఎన్నికల వేళ వైసీపీ నేతల ఒత్తిడికి తలొగ్గి లక్ష మంది దాకా వాలంటీర్లు రాజీనామా చేశారు. ఇక మిగిలింది లక్షన్నర మంది. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఎన్నికల వేళ టీడీపీ కూటమి నేతలు హామీ ఇచ్చారు.
ఏకంగా పది వేల గౌరవ వేతనం కూడా ఇస్తామని ప్రకటించారు. దాంతో వాలంటీర్లు అంతా వైసీపీకి వెన్నుపోటు చాలా చోట్ల పొడిచి కూటమికి అనుకూలంగా పనిచేశారు అని ప్రచారం సాగింది. తీరా కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఖజానా ఖాళీ అయిందని అంటోంది. కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయి. ఏ మాత్రం ఆదాయం ఉన్నా దానిని అభివృద్ధికి లేదా విలువైన సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే ఖర్చు చేయాలని చూస్తోంది.
అలాంటిది ఏటా వేల కోట్లు ఖర్చు అయ్యే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడం అవసరమా అన్న చర్చ అయితే సాగుతోంది. పైగా వాలంటీర్లు అంతా వైసీపీ హయాంలో నియామకం జరిగిన వారు. ఒకవేళ ఇదే వ్యవస్థను మరో రూపంలో కంటిన్యూ చేయాలని అనుకున్నా అది ఇపుడు చేయరు. కాస్తా ఆర్ధిక వ్యవస్థ కుదురు పడ్డాక చేస్తారు.
అపుడు కొత్తగా నియామకాలు చేపడతారు అని అంటున్నారు. అలా చూస్తే కనుక ఇపుడు ఈ రూపంలో ఉన్న వాలంటీర్ల వ్యవస్థకు దాదాపుగా మంగళం పాడినట్లే అని అంటున్నారు. మరో వైపు చూస్తే వాలంటీర్లను విధులలోకి తీసుకోవాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. వారికి ఎన్నికల్లో వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి ఇపుడు దానిని వమ్ము చేయడం తగదని ఆయన ఫైర్ అయ్యారు.
ఇలా వైసీపీ నేతలు మద్దతు గా మాట్లాడితే వాలంటీర్లకే అది మరింత ఇబ్బంది అని అంటున్నారు. మరో వైపు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వారు ప్రతీ వార్డు పరిధిలో పది మంది దాకా ఉన్నారు. ఇందులో ఇద్దరు ముగ్గురుకి తప్ప మిగిలిన వారికి పెద్దగా లేదు అన్న ఆరోపణలు ఉన్నాయి.
పైగా వారిలో నూటికి ఎనభై శాతం మందిని పర్మనెంట్ చేశారు. దాంతో వారిని ఎక్కడో ఒక చోట సర్దుబాటు చేయాలి. అంతే కాదు సచివాలయ భవనాలు అన్నీ అద్దె భవనాలలో నడుస్తున్నాయి. దానికి అయ్యే ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. దీని విషయంలో కూడా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
సచివాలయ ఉద్యోగులను వారి టాలెంట్ ని బట్టి ప్రభుత్వ శాఖలలో ఖాళీలు బట్టి వివిధ విభాగాల్లో సర్దుబాటు చేస్తారని అంటున్నారు. వీరి సంఖ్య లక్షా పాతిక వేల దాకా ఉంటుంది. మండల స్థాయిలో ఒకటో రెండో సచివాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా కొత్త విధానం తీసుకుని రావాలని ప్రస్తుతం ఉన్న దానిని పక్కన పెట్టాలని కూడా ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నిజంగా చూస్తే ప్రతీ రెండు వేల మందికీ పది మంది ఉద్యోగులు అంటే పెద్దగా అవసరం లేదనే మాట వినిపిస్తోంది.
దాంతో వీరి సేవలను పూర్తిగా వాడుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడమే మంచి పరిణామం అంటున్నారు. మొత్తానికి సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు ప్రభుత్వం అన్నీ ఆలోచించి సంచలన నిర్ణయాలు తీసుకుంటుందని అంటున్నారు.