ఏపీలో ఈ రోజుకు చూస్తే బీజేపీకి టీడీపీకి మధ్య గ్యాప్ కొనసాగుతోంది. 2018లో చంద్రబాబు తానుగా పొత్తు నుంచి తప్పుకున్నారు. అది లగాయితూ అయిదేళ్లుగా బీజేపీ నుంచి అయితే గ్రీన్ సిగ్నల్స్ టీడీపీకి రావడం లేదు. కానీ చంద్రబాబు అయితే జస్ట్ ఏడాది వ్యవధిలోనే పూర్తిగా మారిపోయారు.ఆయన 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత తప్పు తెలుసుకుని కమలం శరణం గచ్చామీ అని అంటూనే ఉన్నారు. అయితే బీజేపీ హై కమాండ్ పెద్దలే కరుణినడంలేదు. ఇక ఏపీ బీజేపీ పరిస్థితి ఎలా ఉంది అంటే 2019 లాగానే అని చెప్పాలి. ఆనాడు నోటా కంటే తక్కువ సీట్లతో ఉన్న బీజేపీ ఈ నాలుగేళ్ల కాలంలో ఏమీ ఎత్తిగిల్లింది అయితే లేదు. ఈ మధ్యలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికలు కానీ ఉప ఎన్నికల్లో కానీ బీజేపీ బలపడిన దాఖలాలు లేవు. ఆఖరుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పరువు పోగొట్టుకుంది బీజేపీ.
జనసేనతో స్నేహం అని చెప్పుకుంటున్నా ఆ పార్టీ కలిసిరావడంలేదు. దీనికి తోడు ఏపీ బీజేపీలో వర్గాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఒక వర్గం తెలుగుదేశంతో పొత్తుకు వెళ్లి ఎన్నో కొన్ని సీట్లు తెచ్చుకుందాని చెబుతూంటే మరో వర్గం వైసీపీతో మద్దతుగా ఉందామని అంటోంది. పార్టీలో ఉన్న అసలైన నేతలు మాత్రం బీజేపీ తానుగా ఈసారి నుంచి అయినా ఎదగాలని కోరుకుంటోంది. 2024 ఎన్నికల్లో ఒక ప్రాంతీయ పార్టీ ఓడి వెనక్కి పోతే ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటోంది.
అయితే అలా జరుగుతుందో లేదో తెలియదు అంత ఓపిక లేదు అన్న వారు మాత్రం తెలుగుదేశంతో పొత్తు ఉంటేనే బీజేపీ బతికి బట్టకడుతుంది అని వాదిస్తున్నారు ఇలాంటి ఉత్సాహవంతులు తమ సీట్లను కూడా ఖరారు చేసుకుంటూ కర్చీఫ్ వేసేస్తున్నారుట. 2014లో తెలుగుదేశం బీజేపీకి ఇచ్చిన సీట్ల ప్రాతిపదికన ఈసారి కూడా అవే సీట్లు కోరాలని డిసైడ్ అయిన వారు తాము 2024లో పోటీ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు
అయితే టీడీపీతో పొత్తు అన్నది బీజేపీ హై కమాండ్ తేల్చాల్సి ఉంది. బీజేపీ పెద్దలు ఈ విషయంలో ఏమంటారో తెలియదు ఒక వేళ పొత్తు కనుక లేకపోతే మాత్ర ఈ అతి ఉత్సాహవంతులలో కొందరు టీడీపీ గూటికి చేరడానికైనా సిద్ధం అని అంటున్నారు. అయితే ఎన్నికల వేళకు టీడీపీలోకి వెళ్తే అక్కడ తమకు సీట్లు ఉంటాయా. ఇస్తారా అన్న డౌట్ కూడా కొందరికి ఉందిట.
ఇక వీరితో పాటు టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన వారు మాత్రం పొత్తులు లేకపోతే కచ్చితంగా తమ సొంత గూటికి అంటే టీడీపీ లోకే వెళ్తారని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు రాజకీయ వ్యూహాల మీద ఆయన గారి చాణక్య రాజకీయం మీద బీజేపీలోని ప్రో టీడీపీ నేతలకు బాగా నమ్మకం ఉందిట. ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు కుదురుతుంది అని వారు ధీమాగా ఉన్నారుట.
అందుకే ఏడాది ముందే తమ సీట్ల నుంచి పోటీకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారుట. మరి తెలుగుదేశంతో బీజేపీ పొత్తు కుదిరినా ఇవే సీట్లు ఆ పార్టీ ఇస్తుందా అన్నది ఒక డౌట్. ఎందుకంటే ఈసారి జనసేన కూడా వచ్చి చేరుతోంది కాబట్టి తెలుగుదేశం చాలా లెక్కలు కూడికలు తీసివేతలు అన్నీ చూసుకోవాలని అంటున్నారు.