కొవ్వూరు: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. మనసా, వాచా, కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మి ప్రతి అడుగులోనూ కూడా రైతులకు మంచి చేసే దిశగానే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోను లేనివిధంగా ప్రతి అడుగులోనూ రైతుకు అండగా నిలుస్తూ రైతు పక్షపాత ప్రభుత్వంగా పనిచేస్తున్నామన్నారు. ఆర్బీకేల ద్వారా విత్తనం దగ్గర నుంచి పంట విక్రయం వరకూ అన్ని సేవలు రైతు ఇంటి ముంగిటనే అందిస్తున్నామన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రైతులను మభ్యపెట్టే పనిలో ఉన్నారని, ఎంత ప్రయత్నించినా ప్రతిపక్షాల కుయుక్తులు పనిచేయవని ఆమె విమర్శించారు. ఈ మేరకు శనివారం హోంమంత్రి వారి కార్యాలయం నుండి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఈ సందర్బంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. రైతులందరికీ జగనన్న ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందని, ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించి ప్రతి గింజను కొనాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఏ రైతు పండించిన పంటకూ ఇబ్బంది కలుగకుండా రంగుమారిన, తడిసిన ఏ ధాన్యాన్నైనా కొనుగోలు చేయండని మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.