ఏలూరు జిల్లా, ఏలూరు: జిల్లాలో ప్రసూతి, శిశు మరణాల నివారణకు వైద్య, శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రసూతి, శిశు మరణాలపై జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ నాల్గవ(సిడియస్ఆర్, యండిఎస్ఆర్) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో శిశు మరణాలు తగ్గుముఖం పట్టాయని అలాగే ప్రసూతి మరణాలు లేకుండా సంబంధిత అధికారులు కృషిచేయాలని అన్నారు. 3వ (సిడియస్ఆర్, యండిఎస్ఆర్) సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సమావేశంలో చర్చించడం జరిగింది. మాతా, శిశు మరణాలకు వాస్తవ కారణాలను జిల్లాలోని పిహెచ్ సి ల పరిధిలో వైద్యులను, ఆశా వర్కర్లను, అంగన్ వాడి కార్యకర్తలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో అధిక రిస్క్ గర్భధారణ గుర్తించిన మహిళల ఆరోగ్య స్ధితిపై ఆశా, అంగన్ వాడీ కార్యకర్తలు, ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు నిరంతర పర్యవేక్షణ పాటించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షితంగా ప్రసవించి తల్లీ, బిడ్డా, క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లేలా చూడాలని కలెక్టర్ కోరారు. ముఖ్యంగా రక్తహీనత కారణంగా గర్భణీలకు అరోగ్య సమస్యలు తలెత్తకుండా ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు, పౌస్టిక ఆహారంసక్రమంగా తీసుకునేలా ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. అధిక రిస్క్ గర్భిణీ స్త్రీలను గుర్తించి వారిని ఒకవారం ముందుగానే ఆసుపత్రుల్లో జాయిన్ అయ్యేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే పిహెచ్ సి ల నుంచి జిజిహెచ్ కి, ఏరియా ఆసుపత్రులకు తీసుకువెళ్లాలన్నారు. ఏలూరు జిజిహెచ్ లో అవసరమైన వైద్యుల , ల్యాబ్ టెక్నిషియన్ల , వైద్య పరీక్షా పరికరాలు గురించి కలెక్టర్ అడిగితెలుసుకున్నారు. వీటికి సంబంధించిన ప్రతిపాధనలను తయారు చేసి పంపాలన్నారు.
ఈ సమావేశంలో డియంహెచ్ఓ డా. డి. ఆశ, జిజిహెచ్ సూపరింటెండెంట్ ఎవిఆర్ మోహన్, అధనపు డియంహెచ్ఓ నాగేశ్వరరాపు, జిజిహెచ్ గైనకాలజిస్టు డా. పద్మ, డా. జోషి, జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్లు, ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లు, ఐసిడియస్ పిడి పద్మావతి, నూజివీడు ప్రభుత్వ ఏరియాఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సింగ్, డా. మల్లిక, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు, వైద్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.