ఉంగుటూరు: తుపాను నష్టాలకు రైతులు అధైర్యపడవద్దని అందరి వద్ద ఉన్న ధాన్యాన్ని ఆర్బీకెల ద్వారా కొనుగోలు చేస్తామని ఏలూరు ఆర్డీవో, మండల ప్రత్యేక అధికారి ఎన్‌ఎస్‌కె ఖాజావలి చెప్పారు.
జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ వారి ఆదేశాలతో శనివారం ఉంగుటూరు మండలం కైకరం, తల్లాపురం, వివిధ గ్రామాల్లో పర్యటించి నీట మునిగిన వరి చేలను, వరి రాశులను పరిశీలించారు. తుపాను వర్షానికి తడిసిన ధాన్యం తేమ శాతాన్ని బట్టి ధర తగ్గింపుతో నిబంధనల మేరకు కొనుగోలు చేస్తారని ఆయన చెప్పారు. బాగా తడిసిన ధాన్యం కూడా 25 నుండి 28 శాతం వరకు నిబంధనల ప్రకారం తీసుకునేందుకు డ్రయర్ మిల్లులను రెడీగా ఉంచామన్నారు. తుపాను వర్షాలు వచ్చిన నాటి నుండి 5వ తేదీన 748 క్వింటాళ్ళు, 6వ తేదీ 5,718 క్వింటాళ్లు, 7వ తేదీన 8,151 క్వింటాళ్లు, 8వ తేదీన 10,599 క్వింటాళ్ళు ఆర్బీకే కొనుగలు చేసినట్లు ఆర్డీవో చెప్పారు. ఇంకా 4,156 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల వద్ద ఉందన్నారు. వాటికి సరిపడా సంచులు, రవాణాకు లారీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీరి వెంట తహసీల్దార్ రమణారావు తదితరులు ఉన్నారు.