Ticker

6/recent/ticker-posts

స్పందన దరఖాస్తులు నాణ్యమైన పరిష్కారం జరిగేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్


ఏలూరు జిల్లా, ఏలూరు:  స్పందన దరఖాస్తులు రీ ఓపెన్ కాకుండా సమస్యకు నాణ్యమైన  పరిష్కారం జరిగేవిధంగా  అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను  జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అందిన దరఖాస్తులను పరిశీలించి వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ స్పందనలో అందిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగానే పరిష్కరించాలని, పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  పేద ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాదని, కావున స్పందన దరఖాస్తుల పరిష్కారంలో అధికారులు ఎటువంటి అలసత్వాన్ని ప్రదర్శించవద్దన్నారు. సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో 268 దరఖాస్తులు అందాయని కలెక్టర్ చెప్పారు.

ఈ సందర్భంగా పెదవేగి మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన రైతులు తమ గ్రామం నుండి కోడె చెరువుకు వెళ్లే ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారని, ఆక్రమణల కారణంగా తమ భూములకు వెళ్లేందుకు దారి లేదని తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.  ఈ విషయంపై వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ను కలెక్టర్ ఆదేశించారు.

             

జంగారెడ్డిగూడెం పంగిడిగూడెం గ్రామానికి చెందిన మాండ్రు  సూర్యచంద్రం తన దరఖాస్తులో దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హై వే నిమిత్తం తన భూమిని సేకరించారని, తనకు ఇంకా నష్ట పరిహారం చెల్లించలేదని, తనకు వెంటనే నష్ట పరిహారం అందించాలని కోరారు. ఈ విషయం పై వెంటనే విచారణ చేసి సదరు రైతుకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని   నేషనల్ హైవే అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


ఉంగుటూరు మండలం ఉప్పుకాపాడు గ్రామానికి చెందిన కుంపట్ల తాతారావు తన దరఖాస్తులో తమ గ్రామంలో వంటగ్యాస్ గోడౌన్ నిర్మించేందుకు పంటపొలాలకు సాగునీరు అందించే తూమును పూడ్చివేసి గోడౌన్ నిర్మాణం చేశారని, దీని కారణంగా తమ పొలాలకు సాగునీరు అందడం లేదని తెలియజేయగా, వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ను కలెక్టర్ ఆదేశించారు.

         

టి. నర్సాపురం మండలం మెట్టగూడెం గ్రామస్థులు తమ దరఖాస్తులో  తమ గ్రామంలోని బి.సి. కాలనీ దిగువన విద్యాధర కాలనీకి అనుసందానం చేసే రోడ్డు ఆక్రమణలకు గురైందని, అక్రమణదారు తమను బెదిరిస్తున్నారని తెలియజేయగా, సదరు సమస్యను పరిశీలించి ఆక్రమణలను తొలగించాలని జంగారెడ్డిగూడెం  డివిజినల్ పంచాయతీ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.

        

కలిదిండి మండలం పడమటిపాలెం గ్రామానికి చెందిన గ్రామస్థులు తమ దరఖాస్తులో  తమ గ్రామంలోని మంచినీటి చెరువు పక్కనేగల పొలాలను చేపల, రొయ్యల చెరువులుగా మారుస్తున్నారని, వీటి కారణంగా మంచినీటి చెరువులు కలుషితం అయ్యే ప్రమాదం ఉందని, కావున చేపల, రొయ్యల చెరువులు తవ్వకుండా చూడవలసిందిగా కోరారు. ఈ విషయంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా పంచాయతీ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.